
ఇద్దరు సినీ తారల మధ్య అభిమానులు రేపిన చిచ్చు చినికిచినికి గాలివానలా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలీవుడ్ నటి మీరా చోప్రా మధ్య వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఈ వివాదంపై స్పందించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు మీద తనపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మీరా చోప్రా బుధవారం ట్విటర్ ద్వారా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్ పోలీస్ శాఖలోని సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మీరా కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు 8 ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. వారిపై ఐటీ చట్టంలోని 67, 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఫిర్యాదు చేసిన మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఆ కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగానే, మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లింది మీరా చోప్రా.
తనపై సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి వంటి వాటికి పాల్పడతామని బెదిరిస్తున్నారంటూ మీరా చోప్రా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. చేసిన ఫిర్యాదును పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మీరా చోప్రా ఈ ట్విట్ చేయగా.. మధ్యాహ్నానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై తాను ఇప్పటికే డీజీపీని, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడానని చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు సమాధానం ఇచ్చారు. మేడమ్.. ఈ విషయంపై నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడాను. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారిని కోరాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలుగులో బంగారం, వాన, మారో,గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించిన మీరా చోప్రా ఇటీవల సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించగా.. మహేష్ బాబు అని బదులిచ్చింది. మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడగ్గా.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కాదని ఆయన కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టపడుతానని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో మీరా చోప్రాను ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు. అంతేకాదు, నీ తల్లిదండ్రులు కరోనాతో చస్తారని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది.
[svt-event date=”05/06/2020,5:22PM” class=”svt-cd-green” ]
Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB
— KTR (@KTRTRS) June 5, 2020