Woman Suicide: భర్త వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. అయినా ఆ మహిళ తట్టుకుంది.. లావుగా ఉన్నావు.. అందంగా లేవంటూ టార్చర్ పెట్టాడు.. అయినా కనికరించింది.. చివరికి వేరొక పెళ్లి చేసుకుంటానన్న భర్తకు అత్తామామలు సైతం మద్దతుగా నిలిచారు. వీరందరి వేధింపులు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ హాసిఫ్ (32) తో 2018 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు.
ఈ క్రమంలో హాసిఫ్ అందంగా లేవని, మరో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్ జానీమియా సైతం సూటిపోటి మాటలతో హలీమాబేగంను ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. అత్తింటి వారితో వారు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో.. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని.. తనను తీసుకెళ్లాలని గురువారం ఉదయం హలీమా తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తరువాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తి మాట్లాడిన తోటికోడలు హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది.
దీంతో హలీమా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. నగరానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణానికి భర్త, అత్తామామ వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు హలీమా తల్లిదండ్రుల నుంచి పలు వివరాలను సేకరించారు.
Also Read: