మావోయిస్టులపై మరో భారీ దెబ్బ పడింది. కరోనా చికిత్స పొందుతూ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ మృతి చెందాడు. చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కన్నుమూశాడు. మధుకర్‌పై 8 లక్షల రికార్డు ఉంది. ఈ నెల 2న వరంగల్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గడ్డం మధుకర్‌తో పాటు కొరియర్(మైనర్)ను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చికిత్సకు తరలించారు. మొదట వరంగల్ ఆసుపత్రిలో మధుకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా తీవ్ర అస్వస్థతతో మధుకర్ మృతి చెందాడు.
దండకారణ్యంలో మరో 12మంది కీలక నేతలకు కరోనా సోకినట్టు పోలీసులకు మధుకర్ వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొండపల్లికి చెందిన మధుకర్ 1999లో పీపుల్స్‌వార్‌లో చేరాడు. మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీలో 12 మంది కీలక నేతలు కరోనాతో బాధపడుతున్నారు. ఇందులో కటకం సుదర్శన్, తిప్పరి తిరుపతి, యాప నారాయణ, బడే చొక్కరావు, కటకం రాజిరెడ్డి, కట్టా రాంచందర్‌రెడ్డి, ములా దేవేందర్‌రెడ్డి, కుంకటి వెంకటయ్య, ముచ్చకి ఉంజల్, కోడి మంజుల, పూనం పద్మ, కాకర్ల సునీత ఉన్నారు.
కాగా కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు చికిత్స చేయించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. తమను కలిస్తే దగ్గరనుండి చికిత్స చేయిస్తామని సూచించారు. కొందరు దండకారణ్యంలో చికిత్స పొందుతున్నారని, జనజీవన స్రవంతిలో వచ్చి మెరుగైన చికిత్స పొందాలన్నారు. చత్తీస్ గడ్ అడవుల్లో ఇప్పటికే 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.