
Man murder in Suryapet : సూర్యాపేట: జిల్లాలో దారుణం జరిగింది. భూతగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చివ్వెంల మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. మండలంలోని కుడకుడ గ్రామంలో గుర్రం శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. గ్రామ శివారులోని పొలాల్లో శశిధర్ రెడ్డిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలో తన భార్య, కొడుకును చంపిన కేసులో శశిధర్ రెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. అయితే, ఇటీవల బెయిల్‌పై విడుదల అయిన శశిధర్ రెడ్డి తన భూమి అమ్మకానికి పెట్టాడు. ఇందులో భాగంగా మంగళవారం వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. అయితే, భూ లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also…Man commits Suicide : ఖమ్మం జిల్లాలో విషాదం.. తమ్ముడు మందలించాడని అన్న ఆత్మహత్య