Palghar Robbery: దొంగలు రోజుకు రోజుకు పెచ్చుమీరుతున్నారు. యూట్యూబ్ చూసి మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ దొంగతనం పోలీసులనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. యూట్యూట్ చూసి దొంగతనానికి పాల్పడిన దొంగను మహారాష్ట్ర పోలీసులు.. యూపీలో అరెస్టు చేశారు. ఈ ఘటన మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 5న అచ్చోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన నగలు, డబ్బును ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు సేకరించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటాడని అనుమానించారు. ఈ క్రమంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు పోలీసు బృందాలను పంపినట్లు అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ శిర్సత్ తెలిపారు. ఇలా వెతుకుతున్న క్రమంలో నిందితుడు దిల్షాద్ ఫయాజ్ షేక్ యూపీలో పోలీసుల కంట పడ్డాడని తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పలు షాకింగ్ విషయాలు తెలిపినట్లు పంకజ్ వివరించారు.
అంతకుముందు నేర చరిత్ర లేని వ్యక్తి.. యూట్యూబ్‌లో ఎలా దొంగతనం చేయాలో చూసి ఆ ప్రకారమే చోరీ చేశానని.. చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దిల్షాద్ ఫయాజ్ షేక్ నుంచి రూ.9.75 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..