Robbery Case: ఓ వ్యక్తి భారీ స్కెచ్ వేశాడు. ఎలాగైనా దొంగతనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. బొమ్మ తుపాకీతో బంగారం షాపునకు వెళ్లాడు. కట్ చేస్తే.. ఆ దొంగకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. బొమ్మ తుపాకీతో బెదిరించి దుకాణంలో బంగారు నగలు దోపిడీకి యత్నించి స్థానికులకు ఓ వ్యక్తి పట్టుబడిన సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురంలోని న్యూ జీకే జ్యూయలర్స్ దుకాణానికి సోమవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చాడు. బంగారు నగ కావాలని కోరాడు. దీంతో యజమాని మిధున్ చక్రవర్తి లోపల నుంచి గొలుసులు తీసి చూపించాడు. మూడు గొలుసులు చూస్తున్నట్లు నటించిన ఆగంతకుడు, జేబులో నుంచి తుపాకీ తీసి మిధున్‌చక్రవర్తిని బెదిరించాడు. అనంతరం రెండు తులాల బరువుండే మూడు గొలుసులతో ఉడాయించే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో యజమాని ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే.. కేకలు వేశారు. దీంతో నిందితుడు పారిపోయే ప్రయత్నంలో.. తుపాకీని కింద పడేసి పరుగుతీశాడు. అనంతరం సమీపంలోని వారంతా అక్కడకు చేరుకున్నారు. సమీపంలోని ఓ కాంప్లెక్స్‌లో దాగి ఉన్న ఆగంతకుడిని స్థానికులు చూసి పట్టుకున్నారు. అనంతరం బంగారం గొలుసులతో సహా నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
కాగా.. నిందితుడి పేరు రాభీ డిగాల్ అని, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. తుపాకీని పరిశీలించిన సీఐ ఎం.వినోద్‌బాబు అది బొమ్మ తుపాకీగా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.