దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవర్‌టెక్, మద్యం తాగి నడపడం, అతి వేగం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో అమాయకులు బలవుతున్నారు. కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. తాజాగా గురువారం మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి గుర్తుతెలియని వాహనం, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిలౌడ్ సమీపంలో జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపారు.
ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారీ
అయితే ప్రమాదం తర్వాత డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడని, అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు
ప్రమాదానికి సంబంధించి సమీపంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన వివరాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వాంగ్మూలం వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టమవుతుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి