Anantapur Crime : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనం నుంచి బయటపడాలని భావించిన వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని పసరు మందు తాగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా గాలివీడుకు చెందిన గంగరాజు కుమారుడు వేమల నారాయణ కొంతకాలంగా ఎన్‌పీకుంటలోని ఓ కార్పెంటర్ వద్ద పనిచేస్తున్నాడు.
నిత్యం మద్యం తాగుతూ ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నాడు. దీంతో ఈ వ్యసనం నుంచి బయటపడాలని భావించాడు. అందుకోసం ఏం చేస్తే బాగుంటుందని తెలిసిన వారిని సలహా అడగడం చేశాడు. ఇలా అడుగుతూ పసరు మందు ద్వారా ఈ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే పులివెందుల సమీపంలోని సారాపల్లిలో మద్యం మానేందుకు పసరు వైద్యం చేస్తారని తెలిసి కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లాడు. వారితో మాట్లాడి తన సమస్య గురించి విన్నవించాడు.
ఇంతలో వారు ఆకు పసరు మందు ఇచ్చారు. దానిని తాగిన నారాయణ తిరిగి ఎన్ పీ కుంటకు చేరుకున్నాడు. అయితే మందు ప్రభావం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చుట్టు పక్కల వారు గమనించి 108లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యలో చనిపోయాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. నారాయణతో కలిసి ఎంతమంది పసరు మందు తాగారో ఆరా తీశారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.