విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈనెల 26 రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న హోండా సిటీ కారు పోలీసులను చూసి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసింది.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి చెక్ చేశారు. అందులో రెండు సంచుల్లో 53 లక్షల 10 వేల రూపాయలు , మరో సంచిలో 2.7 కేజీల బంగారం లభ్యమైంది. కారులో ఉన్న వారిని ప్రశ్నించిన పోలీసులు.. కారు, అందులో ఉన్న క్యాష్, బంగారం సీజ్ చేశారు.
కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారు కాకినాడ K.N.ట్రేడర్స్, శరణ్య బులియన్‌కి చెందినదిగా గుర్తించారు. విశాఖ డిపి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద బంగారం కొనుగోలు చేసి కాకినాడ వెళ్తున్నట్లు తేల్చారు. క్యాష్ లావాదేవీలు.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను చూపకపోవడంతో పోలీసులు నగదును ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కు అందజేశారు. పోలీసుల తీరుపై వ్యాపారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు అనుమానం ఉంటే కోర్టుకు అప్పజెప్పాలి. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పజెప్పడం వల్ల అక్కడి నుంచి తమ నగలను తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలుకు సంబంధించి తమ వద్ద రసీదులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ రోజు బ్యాంక్‌కు సెలవు కావడంతో నగదును బ్యాంకులో డిపాజిట్ చేయలేకపోయామని చెబుతున్నారు. అయితే అతను చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అని పోలీసులు ఆరా తీస్తున్నారు.