Road Accident: కోరుట్లలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు-బస్సు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి!

|

Dec 05, 2021 | 1:07 PM

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Road Accident: కోరుట్లలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు-బస్సు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి!
Road Accident
Follow us on

Korutla Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోహన్‌రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇద్దరు చిన్నారులతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా కోరుట్ల మండలం మోమిన్ పూర్ కు చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారులతోపాటు డ్రైవర్ సాజిద్ అలీ కూడా మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పిల్లల తల్లీదండ్రులతోపాటు మరొక మహిళ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వీరిలో తలకు తీవ్ర గాయాలైన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కోరుట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి నుంచి జగిత్యాల వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది.

ఇటు కోరుట్ల వైపు వెళ్తోన్న కారు అతి వేగంగా వెళ్లి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారే కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని కూడా జగిత్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also….  Eluru Killer Fevers: పశ్చిమగోదావరి జిల్లాలో కిల్లర్ ఫీవర్స్.. అంతుచిక్కని జ్వరాలతో మంచం పడుతున్న విద్యార్థులు!