Telangana: కళ్లు బైర్లు కమ్మేలా శిల్పా చౌదరి క్రైం డేటా.. పోలీసులే షాక్

|

Nov 28, 2021 | 12:31 PM

శిల్పా చౌదరి క్రైం డేటా బయటికొస్తున్నా కొద్ది కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రోటీ మేకర్ పేరుతో లూటీలు.. రియల్ వ్యాపారం పేరుతో దగా.. కిట్టి పార్టీలతో దుబారా అన్నీ బయటకు వస్తున్నాయి.

Telangana: కళ్లు బైర్లు కమ్మేలా శిల్పా చౌదరి క్రైం డేటా.. పోలీసులే షాక్
Shilpa Chowdary
Follow us on

శిల్పా చౌదరి క్రైం డేటా బయటికొస్తున్నా కొద్ది కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రోటీ మేకర్ పేరుతో లూటీలు.. రియల్ వ్యాపారం పేరుతో దగా.. కిట్టి పార్టీలతో దుబారా.. బౌన్సర్లను ఎగదోసి బెదిరింపులు.. ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న శిల్పా క్రైమ్ ఎపిసోడ్స్‌.. ఖాకీలను షాక్‌కి గురిచేస్తున్నాయి. కలర్‌ ఫుల్ లైటింగ్‌తో మెరిసిపోతున్న ఈ సూపర్ డూపర్ విల్లా శిల్పాదే. గండిపేట్‌లో 70కోట్ల రూపాయలతో ఈ లగ్జరీ విల్లా కొనుగోలు చేసింది. కానీ ఇదంతా కష్టార్జితం.. కాదు. ప్రముఖుల్ని, వ్యాపారవేత్తల్ని బురిడీకొట్టించి.. కొల్లగొట్టిన మొత్తంతో కొన్నదని తెలుస్తోంది.

శిల్పా చౌదరి.. అధిక వడ్డీల పేరుతో సినీ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టింది. జర్మనీ నుంచి రోటి మేకర్స్ తెప్పిస్తానని వసూళ్లకు పాల్పడింది. కిట్టీ పార్టీలు, స్పా పార్టీల పేరుతో దండిగా దండుకుంది. ఇలా వచ్చిన మొత్తంలో ఎక్కువ శాతం విల్లాకే వెచ్చించినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.

నార్సింగిలో నాలుగు.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ పీఎస్‌లలో మొత్తం కలిపి శిల్పపై 8 కేసులు నమోదయ్యాయి. బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటికొస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రాథమికంగా 90కోట్లపైగా శిల్పా దంపతులు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరింత లోతుగా విచారిస్తే వసూళ్ల పర్వం అంతకుమించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు అధిక వడ్డీల ఆశజూపి కోట్ల రూపాయలు తీసుకుంది శిల్ప. అయితే వాళ్లు డబ్బు అడిగేసరికి బౌన్సర్లతో బెదిరింపులకి దిగింది. ప్రధానంగా ఈ విషయంపైనే పోలీసులు దృష్టిసారించారు. ఎవరెవర్ని..ఎప్పుడెప్పుడు..ఎలా బెదిరింపులకి దిగిందనే వివరాలపై ఆరాతీస్తున్నారు. బాధితులు ఎవరైనా ధైర్యంగా బయటికొచ్చి ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.

Also Read: టమాట దొంగలు.. పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు.. ఏపీలో కలకలం..