RJ Anannyah partner Jiju Raj found hanging: కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అనన్య మృతి తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్ (36) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్‌కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రిత అనన్య కుమారి తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటి నుంచి జిజూ రాజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
ఒంటరితనం వేధించసాగింది. తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు. దీంతో ఈ బాధ నుంచి బయటపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బయటకు వెళ్లిన తర్వాత జిజు అతడి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనన్య కుమారి లింగమార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్‌నకు గురైన అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. కాగా, అనన్య గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసింది. కాగా, అనన్య మరణంతో తీవ్ర వేధనకు గురైన రిజు రాజ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.