కాసుల కక్కుర్తితో పక్కదారి పట్టిన జూనియర్ అర్టిస్ట్.. సీన్ కట్ చేస్తే కటకటాల్లో కేటుగాడు.. ఇంతకీ ఎం చేశాడంటే..?

|

Aug 17, 2021 | 8:49 AM

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలపు పనులు.. సభ్య సమాజానికి మంచి మెసేజ్‌లు ఇస్తూ టీవీ అర్టిస్ట్‌గా, యూట్యూబ్ క్రైం రిపోర్ట్‌గా పని చేస్తూనే.. బుద్ధి పక్కదారి పట్టింది.

కాసుల కక్కుర్తితో పక్కదారి పట్టిన జూనియర్ అర్టిస్ట్.. సీన్ కట్ చేస్తే కటకటాల్లో కేటుగాడు.. ఇంతకీ ఎం చేశాడంటే..?
Arrested
Follow us on

Cameras Thieve Arrested in Hyderabad: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలపు పనులు.. సభ్య సమాజానికి మంచి మెసేజ్‌లు ఇస్తూ టీవీ అర్టిస్ట్‌గా, యూట్యూబ్ క్రైం రిపోర్ట్‌గా పని చేస్తూనే.. బుద్ధి పక్కదారి పట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశ దుర్భుద్ధి కలిగించింది. అక్రమార్జనకు అసలు దారి వదిలి.. దొడ్డిదారినపడ్డాడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

సినిమాల్లో, సీరియళ్లలో పోలీసు పాత్రలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓ యూట్యూబ్‌ చానెల్‌లో క్రైం బ్యూరో రిపోర్టర్‌గా కూడా పని చేశాడు. నిజ జీవితంలో మాత్రం రివర్స్‌ పాత్ర పోషిస్తున్నాడు. నటించే సమయంలో సినీ కెమెరాలకు ఉన్న డిమాండ్‌ను గమనించి వాటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కెమెరాలు కొనే పరిస్థితి లేకపోవడంతో వాటిని దొంగించాలనుకున్నాడు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో కెమెరాలను చోరీ చేసి వాటితో దందా సాగిస్తున్నాడు. చివరికి హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 11 ఖరీదైన కెమెరాలు, ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతికి చెందిన చుంచు ప్రవీణ్‌కుమార్‌ (32) అలియాస్‌ తేజ అలియాస్‌ కళ్యాణ్‌.. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అతను ఆరు మొబైల్‌ నెంబర్లు వినియోగిస్తున్నట్లు ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. చదవింది ఏడోతరగతి వరకు మాత్రమే. చదివిన చదువుకు చేసే పనికి ఏమాత్రం పొంతనలేదు. ప్రవీణ్‌కుమార్‌ వివిధ ప్రైవేటు కంపెనీల్లో పని చేశాడు. నగరానికి చేరుకుని యూసు‌ఫ్‌గూడలోని ఫోకస్‌ యాక్టింగ్‌ అకాడమీలో చేరాడు. సినిమాల్లో, సీరియళ్లలో అతిథి నటుడిగా పని చేస్తుంటాడు. ఓ యూ ట్యూబ్‌ చానెల్‌లో క్రైం రిపోర్టర్‌గా కూడా పని చేశాడు. మద్యం, జల్సాలకు అలవాటు పడ్డ అతనికి సంపాదన సరిపడలేదు. షూటింగుల్లో ఉన్నప్పుడు సినిమా కెమెరాలకు ఉన్న డిమాండ్‌‌ను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. కెమెరాలు అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ సంపాదించాలనుకున్నాడు. అయితే, వచ్చిన ఆదాయం జల్సాలకే సరిపోతుంది. కెమెరాలు కొనే స్థోమత లేదు. ఎలాగైనా కెమెరాలను తీసుకుని అద్దెకు ఇచ్చిన డబ్బు సంపాదించాలనుకున్నాడు.ఇదే క్రమంలో వాటిని చోరీ చేసి అద్దెకు ఇస్తే భారీగా డబ్బు వస్తుందని భావించాడు. ఇదే క్రమంలో పక్కా స్కెచ్‌తో కెమెరాలను కొట్టేసేవాడని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో కెమెరాలు అద్దెకు ఇచ్చే వారిని ఓఎల్‌ఎక్స్‌ ద్వారా గుర్తించి కాంటాక్ట్‌ చేసేవాడు. తన చానల్‌ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు జిరాక్సులు ఇచ్చి వారి నుంచి అద్దెకు కెమెరా తీసుకునేవాడు. అయితే, వారికి అద్దె చెల్లించకుండా దాట వేసేవాడు. ఆ తర్వాత వారి నెంబర్‌ను బ్లాక్‌ చేసి కాంటాక్టులో లేకుండా చేస్తాడు. ప్రవీణ్‌కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ లోపు నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 కెమెరాలు తస్కరించాడని పోలీసులు తెలిపారు. అతనిపై అల్వాల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో గృహ హింస కేసు కూడా నమోదైనట్లు వెల్లడించారు. పక్కా సమాచారంతో ప్రత్యేక బృందాల సాయంతో ప్రవీణ్‌ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నుంచి 11 కెమెరాలను, ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఏఆర్‌ శ్రీనివాస్‌ అభినందించారు.

Read Also…  Afghanistan Crisis: నేను చేసింది కరెక్టే.. ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోము.. అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన!