Two soldiers killed in landmine blast: జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒక ఆర్మీ అధికారి, ఒక సైనికుడు ఉన్నట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. కేంద్ర బలగాలు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరణించిన ఇద్దరిలో లెఫ్టినెంట్ రిషి కుమార్ బీహార్‌లోని బెగుసరాయ్‌లో నివాసితుడని.. సిపాయి మంజిత్ సింగ్ పంజాబ్‌లోని భటిండాలోని సిర్వేవాలా ప్రాంతానికి చెందినవాడని భారత సైన్యం వెల్లడించింది. ల్యాండ్‌మైన్ పేలుడుతో ఆర్మీ అధికారి, సైనికుడు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
కాగా.. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనారిటీలు, ప్రాంతీయేతర వాసులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ సిబ్బంది ఆపరేషన్‌ను చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌లోని అటవీ ప్రాంతం నుంచే ఉగ్రమూకలు దాడులకు కుట్ర చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పూంచ్ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ ఆర్మీ ఆపరేషన్‌లో మొత్తం తొమ్మిది మంది సైనికులు, ఇద్దరు అధికారులు వీరమరణం పొందారు.
Also Read: