Hyderabad: ఉద్యోగం కోసమని వచ్చాడు.. బాత్‌రూమ్‌లో శవమై కనిపించాడు.. అసలు ఏం జరిగింది!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మహమ్మారికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి, డబ్బులు పొగొట్టుకొని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: ఉద్యోగం కోసమని వచ్చాడు.. బాత్‌రూమ్‌లో శవమై కనిపించాడు.. అసలు ఏం జరిగింది!
Crime

Updated on: Jul 06, 2025 | 11:27 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. హాస్టల్‌ బాత్‌రూమ్‌లో టవాల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర్లపల్లి పవన్ (24) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. బేగంపేట్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం రావడంతో.. జాబ్‌ చేస్తూ ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌లో ఉండి జీవనం సాగిస్తున్నాడు. అయితే పవన్ గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టి పవన్ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇటీవలే పవన్ చేసిన కొన్ని అప్పులను కట్టినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే ఆన్‌లైన్‌లో డబ్బులు పోవడం, ఇంట్లో వాళ్లకు తెలియడంతో మనస్తాపానికి గురైన పవన్ ఆదివారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లి ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు టవాల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లిన పవన్ ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూమ్ మెట్స్ హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా.. పవన్‌ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో కంగారుపడిపోయిన హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. తర్వాత పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌లకు తరలించారు. బాధిడి రూమ్‌లోని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని తనిఖీ చేయగా బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లకు సంబంధించిన మెసెజ్‌లు కనిపించాయి. దీంతో పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.