బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కడపకి చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపులపై కిషన్ రెడ్డి జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 20వ తేదీన తన సెల్‌ఫోన్‌కు రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ ఇస్మాయిల్ 2017లో కువైట్ వెళ్లి.. కొన్నాళ్లు అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ కేసీఎఎస్ రఘువీర్ తెలిపారు. ఇస్మాయిల్ ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ ప్రసంగాలు.. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన న్యూస్, గాసిప్స్ ఫాలో అయ్యేవాడని తెలిపారు. ఇంటర్నెట్‌లో కిషన్ రెడ్డి కాంటాక్ట్ నంబర్ వెతికి పట్టుకుని.. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెప్పారు.ప్రస్తుతం అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టు తెలిపారు.