Online Fraud In Hyderabad: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా ఎంత విడమరిచి చెబుతోన్నా అత్యాశో.. మోసపూరిత ప్రకటనల కారణంగానో నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. కేవలం ఇంటర్‌నెట్ సహాయంతో మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చింతల్ చెరుకుపల్లి కాలనీకి చెందిన రాండు రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి గత నెల ఫేస్‌బుక్‌లో.. రూ.20 వేలకే హోండా యాక్టివా అమ్మకానికి పెట్టిన ప్రకటనను చూశాడు. మంచి కండిషన్‌తో కొత్తగా ఉండంతో తక్కువ ధరకు వస్తుందన్న ఆశకు పోయిన రాజేందర్ వెంటనే ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో అవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి.. తాను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తానని పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నానని, ఉన్నపలంగా జమ్ము కశ్మీర్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని.. కాబట్టి అత్యవసరంగా బైక్‌ను అమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నితిన్‌జైన్ పేరుతో ఉన్న ఓ ఐడీ కార్డును రాజేందర్ వాట్సాప్‌లో పంపించాడు. దీంతో ఆయన చెబుతోన్న మాటలు నిజంగానే నమ్మకం కలిగేలా ఉన్నాయని భావించిన రాజేందర్.. సదరు వ్యక్తి అడిగినట్లుగానే గూగుల్ పే ద్వారా రూ.21,501 పంపించాడు. అయితే ఇక్కడే ఆ నకిలీ వ్యక్తి తన డ్రామాను మొదలు పెట్టాడు. ఏవో ట్యాక్స్‌ల పేరుతో నకిలీ మాటలు చెప్పి మరో రూ.61,117 పంపించమని.. బైక్‌తో పాటు అధికంగా ఇచ్చిన ఈ డబ్బును తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మిన రాజేందర్ వెనకా ముందు ఆలోచించకుడా రూ.61,117 పంపించాడు. ఇక మరుసటి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి మీరు కోరుకున్న స్కూటీ.. లారీలో వస్తుందని ఖర్చుల నిమిత్తం రూ. 1000 పంపించమని అడిగాడు. దీంతో రాజేందర్‌కు అనుమానం మొదలైంది. తనను మోసం చేస్తున్నారని భావించి.. గురువారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆర్మీ వ్యక్తిగా పరిచయం చేసుకున్న అతను రాజేందర్ కాల్ లిఫ్ట చేయడంలేదు. ఇది పక్కాగా స్కెచ్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు జరగడం ఇదే తొలిసారి. గతంలోనూ ఈ తరహా మోసాలు ఎన్నో జరిగాయి. తక్కువ ధరకు వస్తువులు వస్తున్నాయి కాదా అని ఎట్టి పరిస్థితుల్లో అత్యాశకు పోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌లలో ఇలాంటి యాడ్లను చూసి ముందు వెనకా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదని, ముందుగా వస్తువును నేరుగా చూసిన తర్వాతే ముందడుగు వేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Mobile Phone Lost: మొబైల్ ఫోన్ పోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిన యువకుడు.. చివరికి ఏం చేశాడంటే..
నకిలీ పోలీసుల భాగోతం బయటపెట్టిన పోలీసులు..ఆరుగురు అరెస్టు.. భారీగా బంగారం, నగదు వాహనాలు స్వాధీనం
Taiwan Train Accident: సొరంగ మార్గంలో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి.. 72 మందికి గాయాలు..!