BJP youth leader Ashish Goud: భారతీయ జనతా పార్టీ నేత నందీశ్వర్‌గౌడ్ కుమారుడిపై మరో కేసు నమోదైంది. ఆశిష్‌గౌడ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో పంజాగుట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రుణం తీసుకున్న వ్యక్తి అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో సోమాజిగూడ ఎస్‌బిఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. దాదాపు రెండున్నర కోట్ల రుణం తీసుకొని, బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ కారణంతో, కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. 2018 బిజినెస్ కార్యకలపాల కోసమంటూ సోమాజిగూడలోని ఎస్బీఐ బ్రాంచీని రుణం కోసం సంప్రదించారు ఆశిష్. పటాన్‌చెరు గౌతంనగర్ ఆశిష్ గౌడ్‌కు చెందిన 460 గజాల స్థలంలో ఉన్న ఇంటిని మార్టిగేజ్ పెట్టి రూ.2.50 కోట్ల రుణం తీసుకున్నాడు.
అయితే, రుణం చెల్లింపులో అవకతవకలకు పాల్పడటంతో, రెండేళ్ల కిందట రుణం చెల్లించాలంటూ శివంతా ఫార్మా సుమంత్, ఆశిష్ గౌడ్‌కు నోటీసులు జారీ చేసింది బ్యాంకు. వారు స్పందించకపోవడంతో, తనఖా పెట్టిన పత్రాల ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లి షాక్‌కు గురయ్యారు బ్యాంకు అధికారులు. ఆ ఇంటి ఫ్లాట్లను వేరొకరికి ఫోర్జరీ పత్రాలతో విక్రయించినట్లు గుర్తించారు. ఇంటి పత్రాలు బ్యాంకు ఆధీనంలో ఉండగానే కుట్రపూరితంగా ఇంటిని అమ్మేయడం ద్వారా, బ్యాంకుకు టోకరా వేసినట్లు గుర్తించారు. దీంతో ఇటీవల కోర్టును ఆశ్రయించారు, సోమాజిగూడ ఎస్బీఐ బ్రాంచీ చీఫ్ మేనేజర్ రాజుల సతీష్ కుమార్.
కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కేసుపై స్పందించారు ఆశిష్‌గౌడ్. తాను బ్యాంక్‌ను మోసం చేయలేదని, గ్యారెంటర్‌గా మాత్రమే ఉన్నానని స్పష్టం చేశారు ఆశిష్‌గౌడ్. ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం