
నువ్వు నల్లగా ఉన్నావు, ఈ క్రీమ్ నిన్ను అందంగా మారుస్తుందని చెప్పి.. భర్త తన భార్య శరీరంపై యాసిడ్ పోశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని మండుతున్న అగరుబత్తులతో కాల్చాడు. అప్పటికే యాసిడ్ వేయడం వల్ల, మంటలు వేగంగా వ్యాపించి.. మహిళ శరీరం మొత్తం మంటల్లో కాలిపోయింది. ఆ మహిళ కొద్దిసేపటికే మరణించింది. 2017 జూన్ 24 రాత్రి ఏమి జరిగిందో గుర్తుచేసుకుంటూ ఉదయపూర్ ప్రజలు ఇప్పటికీ వణుకుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో, కోర్టు దోషి భర్తకు మరణశిక్ష విధించింది.
నవానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లభ్‌నగర్ నివాసి కిషన్ లాల్ అలియాస్ కిషన్ దాస్ తన భార్య లక్ష్మిని అందంగా లేవంటూ తరచూ ఎగతాళి చేసేవాడు. ఆమెను నల్లగా, లావుగా ఉందని నిత్యం అవమానించి వేధించేవాడు. ఈ వేధింపులు చివరకు జూన్ 24, 2017 రాత్రి ఆమె హత్యకు దారితీశాయి. ఆ రోజు రాత్రి, కిషన్ దాస్ తన భార్య లక్ష్మి బట్టలు తొలగించి.. ఆమె శరీరంపై ఒక రసాయన క్రీమ్ లాంటి పదార్థాన్ని పూశాడు. ‘‘ఇది నిన్ను అందంగా మారుస్తుంది’’ అని చెప్పాడు. కానీ ఆ క్రీమ్ యాసిడ్ వాసన వచ్చింది. తర్వాత అతను తన చేతిలో ఉన్న అగరుబత్తులు వెలిగించి ఆమె శరీరంపై అంటించాడు. యాసిడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి లక్ష్మీ శరీరమంతా మంటల్లో కాలిపోయింది. తీవ్రమైన బాధతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఈ దారుణ ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నవానియా పోలీసులు నిందితుడు కిషన్ దాస్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు తీవ్రతను గమనించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ చంద్ర పలివాల్, కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున 14 మంది సాక్షులు, 36 డాక్యుమెంట్ల ఆధారాలతో నిందితుడిపై నేరం రుజువైంది. మహిళలపై ఇలాంటి క్రూరమైన నేరాలకు కఠినమైన శిక్షలు విధించాలని పలివాల్ కోర్టును కోరారు.
అన్ని వాదనలు విన్న తర్వాత, అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రాహుల్ చౌదరి కీలకమైన తీర్పును వెలువరించారు. ఈ నేరం కేవలం ఒక హత్య మాత్రమే కాదని, ఇది సమాజం ఆత్మను కదిలించే నేరమని అన్నారు. ఇలాంటి వ్యక్తికి పునరావాసం కల్పించడం అసాధ్యమని, అందుకే అతడికి మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధించారు. ఈ తీర్పు మహిళల భద్రతకు ఒక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..