పెళ్లి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత ఇంటి నుంచి గెంటేశాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు మరో యువతిని రహస్యంగా వివాహమాడి వేరు కాపురమే పెట్టాడు. తీరా, విషయం తెలిసిన ఆ మహిళ న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు పూనుకుంది. పలువురు మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. వివాహం అయ్యేనాటికే అతడికి మరో మహిళతో పెళ్లి అయినట్లు తెలుసుకుని తాను మోసపోయానని గ్రహించింది. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్, సుభద్ర దంపతులకు దివ్యశ్రీ ఏకైక కుమార్తె. 2016లో అచ్చంపేట కొండనాగుల గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొట్ల కిరణ్‌తో మ్యాట్రిమోని ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అదే ఏడాది ఫిబ్రవరి 28న తిరుపతిలో వారికి వివాహం జరిగింది. కిరణ్, దివ్యశ్రీ దంపతులు అమీర్‌పేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం కూడా పెట్టారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు.
అంతా బాగుందనుకున్న తరుణంలో అప్పడు మొదలయ్యాయి ఆ యువతి కష్టాలు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ. 40 లక్షలు కావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు కిరణ్. దీంతో ఆమె తల్లిదండ్రులను ఒప్పించి రూ. 15 లక్షలు, 30 తులాల బంగారు నగలు ఇవ్వగా వాటిని అమ్మేసి మధురానగర్‌లో ఇల్లు కట్టుకున్నాడు. 2018 సెప్టెంబర్ నుంచి దివ్యశ్రీని పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాత కనిపించకుండాపోవడంతో 2019లో బెల్లంపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దివ్యశ్రీకి న్యాయం చేస్తామని, తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇచ్చేస్తామని వారు హామీ ఇచ్చారు.
ఇదిలావుంటే, భర్త కోసం అత్తారింటికి వెళ్తే మాకు తెలియదని చెబుతున్నారని దివ్యశ్రీ అవేదన వ్యక్తం చేసింది. తప్పని పరిస్థితుల్లో న్యాయం కోసం రెండేళ్ల వయస్సుగల కుమారుడితో భర్త ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్నానని తెలిపింది. సమాచారం అందుకున్న ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని దివ్యశ్రీ, ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె కుటుంబసభ్యులతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది దివ్వశ్రీ.