సైదాబాద్ చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడి రాజు ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని హైకోర్టును అభ్యర్థించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. రాజు మరణం వెనుక నిజానిజాలు ఏంటో తెలియాలంటే న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని మానవ మృగం రాజు అత్యాచారానికి పాల్పడి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన ఈ నెల 9 నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజు స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం శవమై తేలాడు. రాజు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు.
రాజుది ఆత్మహత్య కాదని.. పోలీసులు ఎక్కడో పట్టుకుని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతని కుటుంబీకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తిరేపుతోంది.
Also Read..
హిట్ మ్యాన్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా ఆ ఆటగాడికే సునీల్ గవాస్కర్ ఓటు
పెళ్లి పేరుతో వంచన.. ఫోటోలు చూసి కనెక్ట్ అయ్యోరో అంతే సంగతులు.. షాకింగ్ క్రైమ్ స్టోరీ..