Himachal Pradesh fire Accident: హిమాచల్ ప్రదేశ్ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కుల్లూ జిల్లాలోని మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దేవాలయాలను ఆనుకుని ఉన్న 26 గోశాలలు దగ్దమయ్యాయి. దాదాపు రూ.9 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై సీఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంలో మంటలు వ్యాపించాయి. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. జనం భయంతో పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో రాయ్ నాగ్ దేవత అనే పురాతన ఆలయం దగ్ధమైంది. శరీరంపై వేసుకున్న బట్టలు తప్ప ఏమీ మిగల్లేదని మజాన్ గ్రామస్థులు వాపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధాన రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరైన రవాణా మార్గం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని స్థానికులు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో నీటివసతి కూడా లేకపోవడంతో ప్రజలు మంటలను ఆర్పడానికి బురద చల్లడం, రాళ్లు విసరడం వంటి చేశారన్నారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.