పశువులను దొంగిలించి కబేళాలకు విక్రయిస్తున్న హర్యానాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తిని తమిళనాడులోని వెల్లూరు జిల్లా పెర్నాంపేట్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని హర్యానాలోని భివానీ జిల్లా జమాల్పూర్ గ్రామానికి చెందిన ఎ హకీముదీన్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక ఆవును, నకిలీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన మినీ ట్రక్కుతో పాటు, రూ .70 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెల్లడించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆవులను, గేదెలను దొంగతనం చేసి.. వాటిని వెల్లూర్ లో కబేళాలకు అమ్మి… తిరిగి ఎంచక్కా ఫ్లైట్ లో తన సొంత ఊరికి వెళ్లిపోతానని అతడు తెలిపాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెలా ఇదే తంతు కొనసాగిస్తున్నట్లు అతడు చెప్పడంతో.. పోలీసులు కంగుతిన్నారు.
పెర్నాంపేటలో పశువులను పెంచే రజాక్ (50) అనే వ్యక్తి తన ఆవులలో ఒకటి శనివారం తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం పెర్నాంపేట, వి కొట్టా రోడ్ జంక్షన్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా… ఆవును తీసుకెళ్తున్న ఒక మినీ ట్రక్కును పోలీసు బృందం గుర్తించింది. పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఫేక్ రిజిస్ట్రేషన్ అని తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఈ ఆవుల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
Also Read: మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి.. ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్