కృష్ణా జిల్లాలో సచివాలయాన్ని బార్‌గా మార్చిన అడ్మిన్‌పై వేటు పడింది. ప్రభుత్వ కార్యాలయంలో అనుచితంగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ సచివాలయంలో అడ్మిన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్య మనోహర్ బరితెగించి.. మద్యం సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో ఎంక్వేరి చేపట్టిన గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్.. అడ్మిన్ సత్య మనోహర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
ఇదిలావుంటే, గుడివాడ పట్టణంలోని అల్లంబడి ప్రాంగణంలో 33, 34వ వార్డుల సచివాలయం అడ్మిన్ సత్య మనోహర్ కార్యాలయంలో మద్యం సేవిస్తూ హాల్‌చల్ చేశాడు. రాత్రి అయితే చాలు సచివాలయాన్ని బార్‌గా మార్చేస్తున్నారు. అడ్మిన్ పాలపర్తి సత్యమనోహర్‌పై పలు ఫిర్యాదులు రావడంతో ఆర్డీవో జి.శ్రీనుకుమార్ గతంలో హెచ్చరించారు. ఇటీవల సచివాలయంలోనే మందు పార్టీలు, విందులు చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. సచివాలయం పని వేళల తర్వాత కార్యాలయం మూసివేయాల్సి ఉండగా అక్కడే రాత్రంతా ఉంటూ గానాబజానా ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
వివిధ పనులపై వచ్చే వారికి పైసలిస్తేనే సానుకూలంగా పని చేస్తున్నారనే అపప్రద మూటకట్టుకున్నారు. సాక్షాత్తూ అడ్మిన్ సమయపాలన పాటించకపోవడంతో మిగతా కార్యదర్శులు ఇబ్బందులకు గురయ్యారు. కార్యదర్శుల వద్ద సాయంత్రానికి వసూళ్లు చేసి రాత్రివేళల్లో పార్టీలు నిర్వహించుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ అడ్మిన్‌పై చర్యలు తీసుకున్నారు.