భర్తల సర్పంచ్ గిరి.. నిర్మల్ జిల్లాలో వరుస వివాదాల్లో సర్పంచ్‌లు, సర్పంచ్ భర్తలు

| Edited By: Janardhan Veluru

Jul 14, 2021 | 3:43 PM

కోరిక తీర్చాలంటూ ఒకరు..భూమి ఇవ్వాలంటూ మరొకరు..బిల్లులపై సంతకాలు చేయాలంటూ మరొకరు. నిర్మల్ జిల్లాలో సర్పంచ్‌లు, సర్పంచ్ భర్తలు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.

భర్తల సర్పంచ్ గిరి.. నిర్మల్ జిల్లాలో వరుస వివాదాల్లో సర్పంచ్‌లు, సర్పంచ్ భర్తలు
Sarpanch Giri Nirmal District
Follow us on

కోరిక తీర్చాలంటూ ఒకరు..భూమి ఇవ్వాలంటూ మరొకరు..బిల్లులపై సంతకాలు చేయాలంటూ మరొకరు. నిర్మల్ జిల్లాలో సర్పంచ్‌లు, సర్పంచ్ భర్తలు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. దీంతో జిల్లాలో సర్పంచులు, సర్పంచ్ భర్తల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భార్యల స్థానంలో సర్పంచ్ గిరి చలాయిస్తూ‌ దాడులకు , ఒత్తిళ్లకు, వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు సర్పంచ్ భర్తలు. అలాంటి ఓ ఘటనలో వేలు దూర్చి దాడికి గురయ్యాడు ఓ సర్పంచ్ భర్త.. మరో సర్పంచ్ భర్త లైంగిక వేధింపుల కేసులో బుక్ అయ్యాడు.

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం కనకా పూర్ గ్రామంలో భూవివాదంలో జోక్యం చేసుకున్న సర్పంచ్ భర్త ముత్తన్నపై దాడికి పాల్పడ్డారు భూయజమానులు. గ్రామంలో మాట్టేరి నరేష్ అనే వ్యక్తికి చెందిన సర్వే నంబర్ 24లోని తన వ్యవసాయ భూమిలో మడిగెల నిర్మాణం చేపడుతుండగా సర్పంచ్ సుంకు రాజవ్వ భర్త సుంకు ముత్తన్న అడ్డుకున్నాడు. ఒక షెట్టర్ ( రూం ) తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తేనే మడిగెల ( షెట్టర్ల ) నిర్మాణానికి అనుమతిస్తానంటూ డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని భూయజమాని మొరపెట్టుకున్నా వినలేదు. దీంతో కట్టలు తెంచుకున్న కోపంతో సర్పంచ్ భర్త సత్తన్న పై దాడికి పాల్పడ్డారు భూయజమాని మాట్టేరి నరేష్. తలకు గాయాలు కావడంతో స్థానికులు సర్పంచ్ భర్తను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఇదే జిల్లాలో నిర్మల్ లోని బైంసా డివిజన్ కుభీర్ మండలంలో ఓ సర్పంచ్ ఏకంగా పెట్రోల్ దాడికి తెగ బడ్డాడు. ఉపాధి హామీ పథకం కింద తాను చేసిన పనులకు బిల్లులు చేయడంలేదని ఆగ్రహించిన సాంవ్లి సర్పంచ్‌.. టెక్నికల్‌ అసిస్టెంట్‌ రావుల రాజు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం సాంవ్లీలో మంగళవారం చోటుచేసుకుంది. సాంవ్లీ గ్రామ సర్పంచ్‌ లాయేవార్‌ సాయినాథ్‌ గత మార్చిలో ఉపాధి హామీ పథకం కింద రూ.11 లక్షల విలువైన అభివృద్ధి పనులను కాంట్రాక్టు తీసుకొని పనులు పూర్తి చేశాడు. అప్పటినుంచి ఈ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు చేయాల్సిందిగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజును కోరుతున్నాడు. అయితే రికార్డులపై గ్రామ కార్యదర్శి సంతకం లేనందున.. తాను ఏమీ చేయలేనని రాజు తిరస్కరిస్తూ వస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్‌ పక్కా ప్లాన్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈజీఎస్ కార్యలయానకి‌ చేరుకుని బాటిల్‌లో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ను టెక్నికల్ అసిస్టెంట్ రాజు‌పై పోసి నిప్పంటించాడు‌. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం రాజు నిర్మల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనలు జరిగి 24 గంటలు కూడా గడువక ముందే ఇదే నిర్మల్ జిల్లాలో మరో సర్పంచ్ భర్త బాగోతం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర సర్పంచ్ కిష్టయ్య తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ అంగన్వాడీ టీచర్. విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ కొన్ని రోజులుగా తనను వేదిస్తున్నాడని.. వేధింపులు ఆపాలంటే తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడికి గురి వేస్తున్నాడండూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అంగన్వాడీ టీచర్. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి న పోలీసులు నిందితుడు కిష్టయ్య పై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. విధులు నిర్వహించట్లేదని గతంలో సదరు అంగన్వాడీ టీచర్‌పై సీడీపీఓ కు కిష్టయ్య ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ కారణంగా నే తనపై వేదింపుల కేసు పెట్టిందంటున్నాడు సర్పంచ్ భర్త కిష్టయ్య. అయిన భార్యల స్థానంలో భర్తల సర్పంచ్ గిరీ ఏంది.. ఈ వేదింపులు దాడులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం.

(నరేష్ , TV9 రిపోర్టర్, ఆదిలాబాద్)

Also Read..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు.. మొత్తం ఎంత జీతం వస్తుందంటే.. వివరాలివే..

మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్