
Nellore Accident: కరోనా వైరస్ వల్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. అనంతరం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం శీతాకాలం కావడంతో మంచు ఆవరించి ఉండటంతో ముందు వెళ్లే వాహనాలు కనిపించక తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి గౌరవరం జాతీయ రహదారిపై నారాయణమూర్తి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు చెన్నై నుంచి బెంగాల్ వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.