Gas Blast at Tiki Industries: గ్యాస్ పేలుడు కాకినాడను భయపెట్టింది. సర్పవరం ఆటోనగర్‌లోని టైకీ పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గ్యాస్ మంటల్లో చిక్కుకుని ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఆటోనగర్ దగ్గరలో ఉన్న టైకీ ఇండస్ట్రీస్ కెమికల్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
గురువారం మధ్యాహ్నం కంపెనీలోని బాయిలర్ లోని ఎయిర్ గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌పై చుట్టూ ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో కంపెనీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గొల్లప్రోలు మండలం పి.మల్లవరంకు చెందిన తోటకూర వెంకట రమణ,పటవల గ్రామానికి చెందిన కాకర్ల.సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందారు.
టైకీ పరిశ్రమలో ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కన్నబాబు స్పాట్‌కు చేరుకున్నారు. అటు అగ్నిమాపక బృందాలు మంటలను అదుపుచేశాయి. ఈ ఫ్యాక్టరీలో గతంలోను పలుమార్లు ప్రమాదాలు జరిగినట్టు చెప్తున్నారు. గాయపడిన వారిని మంత్రి కన్నబాబు పరామర్శించారు.
ఇళ్ల మధ్య టైకీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా కార్మికుల ప్రాణాలు పోతే సహించేది లేదని మంత్రి గౌతమ్ రెడ్డి హెచ్చరించారు.