Arrest in Cryptocurrency Cheating: అధునిక యుగంలో ఆన్‌లైన్ లావాదేవీల ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇదే ఆసరగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో 86 లక్షల రూపాయల మోసం చేసిన నిందితులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. వారినుంచి చెక్‌బుక్‌లు, ఆరు ఏటీఎం, ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన చోటా భాయ్.. అదే రాష్ట్రంలోని సిలిగురికి చెందిన బ్యాంక్ ఉద్యోగితో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చోటా భాయ్ ముఠాగా ఏర్పడి, కమీషన్ పేరుతో 64 బ్యాంకు ఖాతాలు సేకరించారు. అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశజూపి.. 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో ఆన్‌లైన్‌లో ఔత్సాహికుల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించారు. ఈ క్రమంలో నాంపల్లికి చెందిన వ్యక్తి నుంచి రూ.86 లక్షలు వసూలు చేశారు. పెట్టిన పెట్టుబడికి సంబంధించి లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో అసలు వ్యవహారం బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో చోటా భాయ్‌తో పాటు నూర్ ఆలం హక్, ఎక్రమ్ హుస్సేన్, మహమ్మద్ ఇజారుల్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేశామని రాచకొండ పోలీసులు తెలిపారు.
Read Also… Crime News: శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సచివాలయంలో గ్రామ వాలంటీర్ల అఘాయిత్యం!