Jaggaiahpet Road Accident: ప్రాణాలు తీస్తున్నా అతివేగానికి కళ్లెం పడటం లేదు. ఓవర్ స్పీడ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రమాదాలు జరిగాయి. శుభకార్యానికి వెళ్తున్న ఫ్యామిలీని చిన్నాభిన్నం చేశాయి. కృష్ణా జిల్లా(Krishna District) గౌరవరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జంగారెడ్డి గూడెం(Jangareddygudem)లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఓ ఫ్యామిలీ వెళ్తుండగా.. ఓవర్ స్పీడ్‌తో కారు అదుపు తప్పింది. కల్వర్టును ఢీ కొట్టిన కారు ప్రమాదంలో GHMC ఉద్యోగి జోషి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అన్నాచెల్లెలు, మేనకోడలు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాద స్థలికి చేరుకున్న మొబైల్ టీం అండ్ నేషనల్ హైవే టీం.. ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారిని, మరో ఇద్దరినీ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం పై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.అతివేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అటు, హనుమకొండలో జరిగిన ఘటన.. అక్కడి వారిని తలోదిక్కు పారిపోయేలా చేసింది. ల్యాండ్ మార్క్ హోటల్ వద్ద ఓకారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. అంతటితో ఆగలేదు. ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఏం జరుగుతోందో అర్థంకాక.. జనాలు పరుగు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇక, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదానికి కూడా ఓవర్ స్పీడే కారణంగా తెలుస్తోంది. ఐమాక్స్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు వేగంగా డివైడర్‌ని ఢీ కొట్టింది. లక్కీగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులోని ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.