మళ్లీ తెరపైకి నయీం కేసు.. క్లీన్‌ చీట్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్న ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్..సీబీఐతో విచారణకు డిమాండ్

|

Mar 09, 2021 | 1:54 AM

Gangster Naeem:నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. సిట్‌ దర్యాప్తులో ఏం తేల్చకపోవడాన్ని తప్పుపడుతున్న...

మళ్లీ తెరపైకి నయీం కేసు.. క్లీన్‌ చీట్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్న ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్..సీబీఐతో విచారణకు డిమాండ్
Follow us on

Gangster Naeem Case: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. సిట్‌ దర్యాప్తులో ఏం తేల్చకపోవడాన్ని తప్పుపడుతున్న ఆ సంస్థ.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నాలుగు పేజీలతో ఓ లేఖ రాశారు. ఈ లేఖలో.. నయీం చేసిన అరాచకాలు, అతనితో ఇతరులకు ఉన్న సంబంధాలు, సిట్‌ దర్యాప్తును విడమర్చారు. సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నమ్ముతోంది.

సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌.. వివిధ కారణాలతో కేసును పక్కదారి పట్టించిందని తెలిపింది. దోషులను కాపాడే ఉద్దేశంతోనే ఇలా చేస్తోందని చెప్పింది. నయీంకు తెలంగాణలోనే కాదు.. ఏపీ, ఛత్తీస్‌గడ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఆస్తులున్నాయని తెలిపిన ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి..

ఇక్కడి పోలీసులతో ఆయా రాష్ట్రాల్లో విచారణ చేపట్టడం అంత సులువు కాదన్నారు. నయీంకు పోలీసులతోనే కాదు.. రాజకీయ నేతలతోనూ సత్సంబంధాలున్నాయని, ఆ అదునుతోనే అసాంఘిక శక్తులను వెంట వేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు నయీం అరాచాలు సాగాయన్నారు.

హత్యలు, భూములను బలవంతంగా లాక్కోవడం, బెదిరింపులకు దిగడం వంటివి చేశాడన్నారు. సోదాల్లో 24 తుపాకులు దొరకగా.. 130 డైరీలు, 602 సెల్‌ఫోన్లు, 752 భూ దస్తావేజులతో పాటు 2 కోట్లకుపైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు.

అంటే ఏ స్థాయిలో నయీం అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోందన్న పద్మనాభరెడ్డి.. మొత్తం లోతుగా దర్యాప్తు చేస్తే అతనితో అంటకాగిన వారి బాగోతాలు కూడా బయటకు వస్తాయన్నారు. నయీం అనుచరులపై 200పైగా కేసులు నమోదు చేసిన సిట్‌.. పోలీసుల ప్రమేయం లేదని క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తప్పుపట్టింది. అసలుదోషులను శిక్షించేలా చూడాలని అందుకోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి