అల్లర్లు, ఆందోళనలతో అట్టుడుకి పోయిన దేశరాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన విధ్వంసం నుంచి స్థానికులు కొద్దికొద్దీగా కొలుకుంటున్నారు. యావత్ భారతావనినే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో దాదాపు 47 మంది ప్రాణాలు కొల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. కాగా, ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో మహమ్మద్ షారూఖ్ అనే యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు షారూఖ్‌ని అరెస్ట్ చేశారు. అయితే, షారుఖ్‌కి సంబంధించిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటపడ్డాయి.
ఢిల్లీకి చెందిన మహమ్మద్ షారూఖ్…టిక్‌టాక్ వీడియోలు చేస్తూ..ఎప్పుడూ హీరోలా ఫీలవుతుండేవాడట. అనేక షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు. హుక్కా, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు బానిసగా మారిన షారుఖ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మోడల్‌గా మ్యాగ్జిన్ కవర్ పేజీలో తన ఫోటోలు చూసుకోవాలని తహతహలాడేవాడట. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో అతడు విలన్‌గా మారిన షారుఖ్ ఫోటోలు, వీడియోలు సంచలనంగా మారటంతో నెటిజన్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే..ఢిల్లీలో జరిగిన ఘటనపై రెండు సిట్ బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 254 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా.. ఇందులో 41 కేసులు ఆయుధ చట్టం కింద నమోదు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న 903 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతే కాదు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.