శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు ఓ క్రికెట్ కోచ్. నిత్యం ఆ అమ్మాయి శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఎంత వారించినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు కోచ్‌తో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…పుదుచ్చేరికి చెందిన సీనియర్ క్రికెట్ ఆటగాడు, కోచ్ అయిన తమరైకన్నన్ వద్ద బాధితురాలు క్రీడా శిక్షణ కోసం చేరింది. అయితే అతను నిత్యం తనను అసభ్యంగా తాకే వాడని, లైంగికంగా వేధించేవాడని ఆ బాలిక పేర్కొంది.
ప్రేమించాలని మెసేజ్ చేశాడు!
‘నన్ను ప్రేమిస్తున్నట్లు కోచ్ తమరైకన్నన్ మెసేజ్ చేశాడు. అతని ప్రేమను అంగీకరించకపోతే కోచింగ్ ఇవ్వనని కూడా బెదిరించాడు. నిత్యం నా శరీర భాగాలను అసభ్యంగా తాకుతూ ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడు. ఎంత వారించినా వినికపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి అతను భార్యతో నా ఇంటికి వచ్చాడు. పోలీసుల దగ్గరకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. అయితే నేను మాత్రం అతనికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందుకే ఛైల్డ్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించాను’ అని బాధితురాలు వాపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కోచ్‌తో పాటు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు సీఏపీ ప్రతినిధులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు.
Also Read: