Mother Dead – Covid-19: కోవిడ్ మహమ్మారి మొదలైన నాటినుంచి దేశంలో హృదయవిదారక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో కూడా కొందరు సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు కొడుకును శ్మశానవాటిక సిబ్బంది రూ. 5000 డిమాండ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలోని కియోంజార్ జిల్లా కృష్ణపూర్ గ్రామంలో వెలుగుచూసింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ మృతదేహాలతో శ్మశానాలన్నీ నిండిపోయినప్పుడు ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ ముఖాన్ని కుమారుడికి చూపేందుకు సిబ్బంది రూ.5000 డిమాండ్ చేయడం వీడియోలో కనిపిస్తోంది.
రూ. 5000 ఇస్తే ముఖాన్ని చూపుతా లేకుంటే పీపీఈ కిట్ లో ప్యాక్ చేసిన మృతదేహానికి అలాగే అంత్యక్రియలు నిర్వహిస్తా.. అంటూ సిబ్బంది ఒకరు మృతురాలి కొడుకుతో గట్టిగా చెబుతుండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని మహిళ కుమారుడు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేస్తుండగా ఉద్యోగి వారించాడు. తాను వీడియోను రికార్డు చేసి.. ఇంటర్ నెట్లో అప్‌లోడ్ చేస్తానని తనను జైలు పంపినా.. పట్టించుకోనంటూ.. కడుపు తరుక్కుపోతున్న మృతురాలి కొడుకు దానిలో పేర్కొంటున్నాడు.
కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో స్ధానికులు లంచం అడిగిన శ్మశానవాటిక ఉద్యోగిపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ వీడియో తమ నోటీసుకు వచ్చిందని, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ ఆశిష్ ఠాక్రే తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read: