కరోనా సమయంలో కూడా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ బంగారు ఆభరణాల అపహరిస్తున్నారు. కరోనా టాబ్లెట్స్ అంటూ మహిళలకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోసుకెళ్తున్నారు దొంగలు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కుడ గ్రామంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75)వృద్ధ మహిళ నివశిస్తోంది. ఇటీవల ఆ గ్రామానికి వెళ్లిన కొందరు దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు అని చెప్పి, ప్రభుత్వం వారు పంపించారని…. ఇంటింటికి తిరిగి ట్యాబ్లెట్లను ఇస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ మత్తు టాబ్లెట్ ఇచ్చారు. వాటిని వేసుకోగానే సదరు వృద్ధ మహిళ మైకంలోకి వెళ్లింది. దీంతో దుండగులు ఆమె ఒంటిపై ఉన్నటువంటి మూడు తులాలన్నర బంగారు పుస్తెలతాడును దొంగలు అపహరించి పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Also Read: కరోనా మహమ్మారితో మరో భయం..మానసికంగా నలిగిపోతున్న ప్రజలు..ఆందోళనతో అనారోగ్యం!