Hyderabad Vehicle Thief: వాడు మామూలు దొంగోడు కాదు.. చోరీ చేయడం ఒక ఎత్తైతే.. పట్టుకోండంటూ పోలీసులకే వీడియోకాల్!

|

Jun 10, 2021 | 12:34 PM

వాడు మామూలు దొంగోడు కాదు. చోరీ చేయడం ఒక ఎత్తు అయితే.. తనను పట్టుకోలేరన్నది వాడి కాన్ఫిడెన్స్‌. ఆ నమ్మకంతోనే పోలీసులకు సవాల్‌ విసురుతున్నాడు.

Hyderabad Vehicle Thief: వాడు మామూలు దొంగోడు కాదు.. చోరీ చేయడం ఒక ఎత్తైతే.. పట్టుకోండంటూ పోలీసులకే వీడియోకాల్!
Cars Thief Challenge To Hyderabad Police
Follow us on

Hyderabad Vehicle Thief: వాడు మామూలు దొంగోడు కాదు. చోరీ చేయడం ఒక ఎత్తు అయితే.. తనను పట్టుకోలేరన్నది వాడి కాన్ఫిడెన్స్‌. ఆ నమ్మకంతోనే పోలీసులకు సవాల్‌ విసురుతున్నాడు. మీరు ఎంత నిఘా పెట్టినా, తన ఆచూకీ కోసం ప్రయత్నించినా.. దొరకను గాక దొరకని తెగేసి చెబుతున్నాడు. నా కోసం తిరిగింది చాలు.. మా ఊర్లో మంచి ఫుడ్‌ దొరుకుతుంది తిని వెళ్లడంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నాడు. నా అంత నేను అలిసిపోయి మీ దగ్గరకు వస్తే కానీ మీరు నన్ను పట్టుకోలేరంటూ ఫోన్‌ చేసి మరీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఈ ఏడాది జనవరిలో నిర్మాత మంజునాథ్‌ కారు చోరీకి గురైంది. ఆ క్రమంలో నమోదైన కేసులో… చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన ఓ దొంగ అని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అతని ఊరుకు వెళ్లినా పట్టుకోలేక ఉట్టి చేతులతో తిరిగి వచ్చారు. అంతేకాదు.. పోలీసులకే ఏకంగా వీడియో కాల్‌ చేసి మరీ సవాల్‌ విసిరాడా దొంగ. నా ఫోటో తీసి పెట్టుకోండి.. అంతవరకే.. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దొరకనని చెప్పడం పోలీసులకు షాక్‌ ఇచ్చినట్టు అయింది.

రాజస్థాన్‌కు చెందిన ఈ గజదొంగ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 కార్లను చోరీ చేశాడు. ఏ ఒక్క కేసులో కూడా అతన్ని పోలీసులు పట్టుకోలేదు. కేసును చేధించింది లేదన్నది వాడి ట్రాక్‌ రికార్డ్‌. ఆ దొంగ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎలా చోరీ చేస్తాడన్నది ఎవరికీ తెలియదు. కానీ చోరీ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాడన్నది మాత్రం పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లారు. ఊరు వివరాలు తెలుసుకుని కొన్ని రోజులు నిఘా పెట్టారు. అయినా దొరకలేదు. పైగా పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సదరు దొంగనే.. నేరుగా పోలీసులకు ఫోన్‌ చేయడం దిమ్మతిరిగినంత పనైంది. మీరు నా గురించి వెతికింది చాలు.. నా కోసం టైం వేస్టు చేసుకోకండి అన్నట్టుగా మాట్లాడి పోలీసులను ఖాళీగా తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా చేశాడు.

అయితే కారును పోగొట్టుకున్న నిర్మాత మంజునాథ్‌ మాత్రం.. కారు పోతే పోనీ కానీ.. అందులో విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటినైనా రికవరీ చేసి ఇచ్చేలా చూడండి అంటూ వేడుకుంటున్నాడు. స్థలాలకు సంబంధించిన కీలక పత్రాలు అందులో ఉన్నాయని చెబుతున్నాడు. ఓవైపు తెలివిమీరిన దొంగ.. మరోవైపు బాధితుడి ఆవేదనతో పోలీసులు నలిగిపోతున్నారు. నేరచేధనలో ముందున్న హైదరాబాద్‌ పోలీసులకు ఇప్పుడీ చోరీ వ్యవహారం పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది.

Read Also…  Suryapet Spurious Seeds: రైతులను నిలువన ముంచుతున్న కేటుగాళ్లు.. సూర్యాపేటలో రూ.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్