కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంటను బలవంతంగా విడదీసి యువతిని అపహరించుకుపోయిన సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా పోలీసు అధికారులను ఆ జంట ఆశ్రయించిన కాసేపటికే.. నవ వధువును అపహరించడం కలకలం సృష్టించింది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని బేతపూడిలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన చందు, కౌసర్ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. సోమవారం గుంటూరు నగరంలోని నెహ్రు నగర్ లో ఉన్న శేషాచల ఆశ్రమంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత.. నూతన దంపతులు జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో.. తమకు రక్షణ కావాలని కోరారు.
ఇద్దరివైపు పెద్దలను పిలిపించిన పోలీసులు.. వాళ్లిద్దరూ మేజర్లని, ఎలాంటి ఇబ్బందీ కల్పించకూడదని నచ్చజెప్పి పంపారు. పోలీసుల భరోసాతో నూతన దంపతులు పోలీసు స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళుతుండగా యువతి తరపు బంధువులు కొందరు వచ్చి దాడి చేసి నవ వధువును అపహరించు పోయారు. తన భార్యను అప్పగించాలని వేడుకున్నా.. వినకుండా అతన్ని చితకబాది వధువును తీసుకెళ్లారు. ఆ విజువల్స్ అక్కడున్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి.
రెండు రోజులు గడిచినా తన భార్య ఆచూకి తెలియడం లేదని వరుడు ఆవేదన చెందుతున్నాడు. తన భార్యను తనకు అప్పగించకపోతే.. స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు వరుడు చందు.