నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ముఠా గ్రామాల్లో తిరుగుతూ అతి తక్కువ ధరకే సెల్ ఫోన్లు విక్రయిస్తోంది. 10 వేల రూపాయల విలువ చేసే కొత్త మొబైల్ ఫోన్ కేవలం 5 వేల రూపాయలకే ఇచ్చేస్తున్నారు. బిల్లు అడిగితే మాత్రం ఏవో కారణాలు చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా గూడూరు ప్రాంతంలోని గ్రామాల్లో ఈ బిజినెస్ చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో సెల్ ఫోన్ విక్రయ ముఠాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గూడురులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మేకల కృష్ణ, మేకల పవన్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి 228 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కొట్టేయడం వీరి పని. ఏపీలో కొట్టేసి, ఏపీలోనే అమ్మేస్తే అనుమానం వస్తుందని, చెన్నైలో సెల్ ఫోన్లు కొట్టేయడం పనిగా పెట్టుకున్నారు. చెన్నైలోని రద్దీ ప్రాంతాల్లో ఫోన్లు దొంగిలించి ఏపీలో అమ్ముతున్నారు. కొట్టేసిన ఫోన్లను ఫార్మెట్ చేసి, కొత్త ఫోన్లలా పల్లెటూళ్లలో సగం రేటుకే అమ్మేస్తున్నారు. గూడూరు పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా దొంగ సెల్ ఫోన్లను విక్రయిస్తున్నట్లు తేల్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దర్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు.
Also Read: ‘జై భీమ్’ సినిమాలో సినతల్లి పాత్ర పోషించింది ఈమె అంటే నమ్ముతారా..? ఆసక్తికర విషయాలు
పోలీసులకు కొత్త పవర్స్ ఇవ్వనున్న ప్రభుత్వం… ఇకపై ఆ బాధ్యతలు వారికే.. !