Prakasam District Birthday Party: బర్త్ డే పార్టీల్లో స్నేహితుల అత్యుత్సాహం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. సరదాగా ఆటపట్టిద్దామని చేసే వింత చేష్టలు వికృతంగా మారి.. బర్త్‌డే కాస్తా డెత్ డే గా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బర్త్‌డే చేసుకుంటున్న వారి ముఖంపై ఫోమ్ స్ప్రే చేయడం, ముఖానికి కేక్ పులమడం, కేక్‌పై ఉన్న స్పెషల్ క్యాండిల్ వెలిగించే క్రమంలో నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగడం వంటి సందర్భాలు.. స్నేహితుల మధ్య గొడవలకు కూడా దారి తీస్తుంటాయి. ఇదంతా సరదాగా ఆటపట్టిద్దామని చేసినా.. చివరకు విషాదాలను మిగుల్చుతుంటాయి. అలాంటి ఓ సంఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్న యువకుడు.. బర్త్ డేను స్పేహితులతో ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆకతాయి స్నేహితుల అత్యుత్సాహం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేడుకల్లో స్నేహితులు చేసిన పనికి పొట్టలో పేగులు పగిలిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే.. యువకుడికి సకాలంలో వైద్యం అందడటంతో చివరకు బతికి బయటపడ్డాడు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ కంపెనీలో పనిచేసే ఓ యువకుడు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అర్ధరాత్రి కేక్ కట్ చేసేందుకు స్నేహితులను పిలిచాడు. కేరింతల మధ్య ఉత్సాహంగా కేక్ కట్ చేసి స్నేహితులందరికీ కేక్ తినిపించాడు.. అందరూ శుభాకాంక్షలు సైతం తెలిపారు. అయితే పార్టీలో పాల్గొన్న కొంతమంది స్నేహితులు దుర్మార్గంగా ప్రవర్తించి ఆ యువకుడి బర్త్‌డేను కాస్తా డెత్‌డేగా మార్చేంత పనిచేశారు. క్వారీల్లో హైప్రజెర్ కోసం వినియోగించే ప్రెజర్ పంప్‌ను ఆ యువకుడి మలద్వారం దగ్గర పెట్టారు. అనంతరం లోపలికి హైప్రెజర్‌తో గాలిని పంప్ చేశారు. దీంతో అతని పొట్ట బెలూన్‌లా ఉబ్బిపోయింది. స్నేహితుల అరాచకంతో పొట్టలో పేగులు పగిలిపోయాయి. గాల్‌బ్లాడర్‌లోకి నీరంతా వచ్చి చేరింది. దీంతో విపరీతమైన నొప్పితో ఆ యువకుడు విలవిలలాడాడు. కేకలు పెడుతూ ఏడుస్తుండటంతో స్నేహితులు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని యువకుడిని వదిలిపెట్టారు.
ఆ తర్వాత వెంటనే యువకుడిని ఒంగోలులోని సంఘమిత్ర ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లు.. కోమాలోకి వెళ్లిన ఆ యువకుడికి వెంటనే ఆపరేషన్ చేసి పొట్టలోని గాలిని తీసేశారు. పగిలిపోయిన పేగులకు శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరో గంట ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని, ఇలాంటి శస్త్ర చికిత్సలు ప్రపంచంలోనే అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే.. మృత్యువుతో పోరాడి యువకుడు బతకడంతో కుటుంబ సభ్యులుఊపరిపీల్చుకున్నారు.
ఫెరోజ్, టీవీ9 తెలుగు రిపోర్టర్, ప్రకాశం జిల్లా
Also Read: