క్షుద్రపూజలు చేస్తున్నారని అనుమానం.. ఏకంగా కుటుంబం మొత్తాన్ని.. ఆ ఊరు వాళ్లు ఏం చేశారో తెలిస్తే..

ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో చేతబడులు, క్షుద్రపూజల వంటి మూడనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ ఉన్నాయనే అనుమానంతో కొందరు ఇతరుల ప్రాణాలకు అపాయం తెచ్చిపెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను దారుణంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు.

క్షుద్రపూజలు చేస్తున్నారని అనుమానం.. ఏకంగా కుటుంబం మొత్తాన్ని.. ఆ ఊరు వాళ్లు ఏం చేశారో తెలిస్తే..
Purnia

Updated on: Jul 07, 2025 | 9:24 PM

క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒక కుంటుంబంలోని ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టిచంపిన ఘటన బీహార్‌ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లాలోని టెట్‌గామా అనే గ్రామంలో గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు మరణించారు. మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు. అయితే గ్రామంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అయితే గ్రామంలోని ఓ కుటుంబం క్షుద్రపూజలు చేయడం వల్లే ఇలా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని వ్యక్తులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టు, ఆ తర్వాత వారిని నిప్పుపెట్టి దహనం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

అయితే గ్రామస్తుల దాడి నుంచి తప్పించుకున్న ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఈ దారుణాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. తమ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ కుటుంబంపై క్షుద్రపూజలు చేస్తున్నట్టు నిందలు మోపి, ఆ కారణంగా తమ కుటుంబంపై దాడి చేసి, ఆ తర్వాత సజీవదహనం చేసినట్టు ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో ఘటనా టెట్‌గామా గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని చెరువు సమీపంలో మృతదేహాల వాసనను పసిగట్టిన డాగ్స్‌ పోలీసులను చెరువు దగ్గరకు తీసుకెళ్లాయి. అక్కడ కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను గుర్తించిన పోలీసులు వాటిని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.