Married Woman: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సమాజానికి తలవంపులు తెచ్చే ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సుపాల్ పరిధిలోని కిసాన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కుటుంబం.. కట్నం కోసం వివాహితురాలిని ఎనిమిది నెలలుగా ఇంట్లో బంధీగా ఉంచింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే వారు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ ప్రమీలా కుమారి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆమెను బందీ చేసిన ఇంటి తాళం పగులగొట్టి బయటకు తీసుకువచ్చారు.
కిసాన్‌పూర్‌కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి యూపీలోని నోయిడాకు చెందిన బీటెక్ పూర్తిచేసిన యువతితో 2018 మార్చి 7 న వివాహం జరిగింది. ఆ సమయంలో వరుడికి వధువు తండ్రి కారుతో పాటు రూ. 17 లక్షలు కట్నంగా ఇచ్చాడు. తరువాత ఆ దంపతులు కిసాన్‌పూర్‌లో కాపురం పెట్టారు. వారికి ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమార్తె కూడా ఉంది.
అయితే గత కొంతకాలంగా అత్తామామలు మరో రూ. పది లక్షలు తీసుకురావాలని కోడలిని వేధిస్తున్నారు. ఆమె వారు అడినంత మొత్తం తీసుకురాకపోవడంతో భర్త, అత్తామామలు కలిసి ఎనిమిది నెలలుగా ఓ గదిలో బంధించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి ఆమెను బంధీ నుంచి విముక్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ప్రమీలా కుమారి తెలిపారు.
Also Read: