Bihar Boiler Explosion: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ బాయిలర్ పేలిన ఘటనలో 6 మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నూడిల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో కనీసం ఆరుగురు కార్మికులు మరణించారు. డజనుకు పైగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారో తెలియరాలేదు. పేలుడు చాలా బలంగా ఉందని స్థానికులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశానికి 5-కిమీ దూరం వరకు వినిపించినట్లు వెల్లడించారు. మరోవైపు భారీ ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు కనీసం 5 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. పేలుడు ధాటికి పక్కనే ఉన్న సంస్థలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినప్పుడు పెద్ద చప్పుడు వినిపించిందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణం వెంటనే తెలియరాలేదు. మరోవైపు ఫ్యాక్టరీ గేట్లు మూసివేసిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఈ ప్రమాదంతో గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నామన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Read Also… Goa Elections: గోవాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టీఎంసీలో చేరిన ఐదుగురు నేతలు ఆపార్టీకి రాజీనామా!