Bengaluru Gang Rape Case: ఓ మహిళను హింసిస్తూ.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. శుక్రవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు రీకన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తుండగా పోలీసు కస్టడీ నుంచి ఆరుగురు నిందుతుల్లో ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.
ఇదిలావుంటే, ఓ గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఒక యువతిని కొందరు వేధించి, చిత్రహింసలకు గురిచేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డ వీడియోకు సంబంధించిన కేసును అస్సాం, బెంగళూరు, బంగ్లాదేశ్ పోలీసులు కలిసి ఛేదించారు. వైరల్ అయిన వీడియోలో బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వారిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అంతకు ముందే ఆకతాయిలను గుర్తించాలని అస్సాం ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో ఆరుగురు నిందితులను అరెస్ట్ బెంగళూరుకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో నిందితులతో విచారణ జరుపుతుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అయితే, ఈ కేసుకు సంబంధించిన మూలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నాయని ఆ దేశ మీడియా తెలిపింది. బాధితురాలు, నిందితుల్లో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారని ఢాకా పోలీసులు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ దారుణమైన సంఘటన రెండు వారాల క్రితం కేరళలో జరిగిందని వారు చెప్పారు. బాధితురాలు, నిందితుడి కుటుంబాలను సైతం గుర్తించామని బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు.
ఇదిలావుంటే, వైరల్ అయిన ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు, మరో యువతి కలిసి 22 ఏళ్ల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతిని దారుణంగా కొట్టి, వేధించారు. బాధితురాలిని తీవ్రంగా గాయపర్చారు. ఆ తరువాత ఆమెను నలుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇటీవల అస్సాంలోని జోధ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వచ్చాయి. నాగాలాండ్‌కు చెందిన ఆ యువతి, జోధ్‌పూర్‌లో పనిచేస్తుంది. అక్కడే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వార్తపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అస్సాం ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న యువతి, వైరల్ వీడియోలోని బాధితురాలు ఒకరు కాదని పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సైతం ధ్రువీకరించారు.