బిక్షాటన చేయగా వచ్చిన డబ్బులు టవల్‌లో మూట కట్టుకోవడమే ఆ వృద్దుడి పాలిట మృత్యువుగా మారింది. రోజులాగే బిక్షాటన చేసి ఇంటికి వెళ్తున్న ఆతని డబ్బులపై కన్నేశాడు ఆటో డ్రైవర్. పక్కా పథకం ప్రకారం ఆటోను దారిమళ్లించి వృద్ధుడిని హతమార్చాడు. తప్పించుకుని పోయే క్రమంలో స్థానికులకు పట్టుబడి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన వెంకటయ్య (69) బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లి బిక్షాటన చేసి సాయంత్రం గ్రామానికి చేరుకుంటాడు. గత కొన్నెళ్లుగా ఇదే అతని దినచర్య. అయితే ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం గ్రామానికి తిరిగి వచ్చేందుకు అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ ఆటో ఎక్కాడు వెంకటయ్య. వృద్దుడి దగ్గర ఉన్న టవల్ లో డబ్బులు గుర్తించి, వాటిని కాజేయాలని ఆటో డ్రైవర్ రాఘవేందర్ పథకం వేశాడు. మార్గ మధ్యలో ఆటోను దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
కొద్ది దూరంలో ఆటో ఆపిన రాఘవేందర్, వెంకటయ్య దగ్గర ఉన్న డబ్బుల మూటను లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో రాఘవేందర్ తన దగ్గర ఉన్న కత్తితో వెంకటయ్యపై దాడి చేశాడు. అయినప్పటికి వెంకటయ్య ప్రతిఘటించడంతో జరిగిన తోపులాటలో ఇద్దరు ఆ పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. అనంతరం బావిలోనే వెంకటయ్యను హత్య చేశాడు ఆటో డ్రైవర్ రాఘవేందర్. బావిలో నుంచి పైకి వస్తున్న క్రమంలో రాఘవేందర్ ను గుర్తించిన స్థానికులు ఆతన్ని పట్టుకోని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంకటయ్య మృతదేహాన్ని బావిలో నుండి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాఘవేందర్ కు గతంలో నేరచరిత్ర ఉందని గ్రామస్తులు అంటున్నారు. గతంలో పలు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన రాఘవేందర్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని మహబూబ్‌నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…