గుజరాత్ బటోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత చైర్మన్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. రణ్‌పూర్ మండలంలోని జలీలా గ్రామం నుంచి దళిత చైర్మన్ భర్త బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆయన్ను అడ్డగించారు. కర్రలు, ఇనుపరాడ్లతో మంజీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడిక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. కొద్ది రోజుల క్రితం మంజీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా తమ పట్ల నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.