Pakistan: పెషావర్‌లో పెను విషాదం..ఆత్మాహుతి దాడిలో 30 మంది మృత్యువాత..

|

Mar 04, 2022 | 5:20 PM

పాకిస్తాన్‌లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెషావర్ నగరంలోని ఓ మసీద్‌లో బాంబు పేలి సుమారు 30 మంది మృత్యువాత పడ్డారు.

Pakistan: పెషావర్‌లో పెను విషాదం..ఆత్మాహుతి దాడిలో 30 మంది మృత్యువాత..
Pakistan Bomb Blast
Follow us on

పాకిస్తాన్‌లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెషావర్ నగరంలోని ఓ మసీద్‌లో బాంబు పేలి సుమారు 30 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఈ సూసైడ్‌ అటాక్‌ జరిగిందని పెషావర్‌ పోలీసులు భావిస్తున్నారు. కాగా  ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు. ఈ ఘటనకు సంబంధించి పెషావర్ సిటీ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఈ పేలుడు ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా మృతి చెందినట్లు తెలిపారు.  మరోవైపు 30 మంది మృతదేహాలను  ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు లేడీ రీడింగ్ ఆస్పత్రి మేనేజర్ అసిమ్ ఖాన్ వెల్లడించారు.

శుక్రవారం ప్రార్థనల సమయంలో..

పెషావర్ లోని కిస్సా ఖవాని బజార్ లో ఉన్న మసీదులోకి ఇద్దరు దుండగులు చొరబడే ప్రయత్నం చేశారు. అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో పోలీసుకు గాయాలు అయ్యాయి. కాగా కిస్సా ఖవాని బజార్ లో చాలా దుకాణాలు ఉంటాయి. దీనికి తోడు శుక్రవారం కావడంతో  ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది.  కాగా బాంబు పేలుడుతో లేడీ రీడింగ్ ఆస్పత్రి దగ్గర హై అలెర్ట్ ప్రకటించారు. కాగా  ఎన్నోఏళ్ల తర్వాత  ఇవాళ రావల్పిండిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావాల్సివుంది. అంతలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా ఈ ఘటనలో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, పేలుడుకు ముందు కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

Also Read:Varalaxmi Sarathkumar: కుర్ర హీరో సినిమాలో కీలక పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ..

Bihar Blast: ఇంట్లో భారీ పేలుడు.. పది మంది మృతి.. ఘటనకు అదే కారణమని అనుమానాలు

Polavaram: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ హామీ