ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. గతంలో జరిగిన హత్య ఘటనలను మరవకముందే మరో మర్డర్ అటెంప్ట్ జరగడంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిని చంపేందుకు దాడి చేశారు. ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. రొంపిచర్ల ఎంపీపీ భర్త వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని స్థానిక టీడీపీ (TDP) నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగిందని, వాటి గురించి పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రక్షణ కరవైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) ఖండించారు. వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. పల్నాడు జిల్లాలో హత్యలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వర పాడులో టీడీపీ లీడర్ జాలయ్యను ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన జల్లయ్యను స్థానికులు మొదట మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తర్వత మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాలయ్య చనిపోయారు. దీంతో జంగమేశ్వర పాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరో ఘటనలో.. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డు పెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. హత్య తర్వాత ప్రత్యర్థులు పరారయ్యారు. కొద్దిరోజులుగా రాజకీయ ప్రత్యర్థులతో కొన్ని వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రయ్యపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి