YS Vivekanada Reddy Murder Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
వైఎస్ వివేకానంద హత్య జరిగి రెండేళ్లయినా నిందితులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ కీలక అడుగుగా ప్రధాన నిందితుడుగా అనుమానిస్తూ సునీల్ యాదవ్ ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ముందు నుంచీ కీలక అనుమానితుడిగా ఉన్నాడు. అయితే, విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ గతంలో హైకోర్టును సైతం ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాగా, సునీల్ యాదవ్ గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీబీఐ బృందం అక్కడకు వెళ్లి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు దర్యాప్తు చేపడుతున్న సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసింది. రెండో దఫా దర్యాప్తు ప్రారంభించి, కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతోంది. అందులో భాగంగా ఇటీవల అనుమానితులను వరుసగా విచారిస్తూ వాంగ్మూలాలు నమోదు చేసింది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో బసచేసిన సీబీఐ అధికారులు జిల్లాలోని వేముల యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి, అనంతపురం జిల్లా కదిరికి చెందిన లోకేశ్, గోవర్థన్, రాజుతోపాటు మరో ఇద్దరిని విచారించి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీనిని అరెస్టుగా చూపుతారా లేదా అనేది ఇంకొద్ది గంటల్లో వెల్లడికానుంది. సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు. అయితే, ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే, ఇటీవలే వాచ్‌మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Read Also…