ప్రేమ పేరుతో అబ్బాయిలు అమ్మాయిల్ని వేధింపులకు గురిచేయడం, దాడుల చేయడం, హత్యలు చేయడం… గత కొంతకాలంగా చూస్తున్నాం. మహిళల రక్షణ కోసం వ్యవస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కి’లేడీ’లు కూడా రెచ్చిపోతున్నారు. అక్రమ సంబంధాల మోజులో కుటుంబాలను ఛిన్నాబిన్నం చేస్తున్నారు. హాని ట్రాప్ ఘటనలు ఈ మధ్య తరచుగా వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తాజాగా ప్రియుడితో రిలేషన్‌లో ఉంటూనే.. తాళి కట్టిన వ్యక్తికి చుక్కలు చూపిందో కిలాడీ లేడీ. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. చివరకు రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె కథ జైలుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే… ప్రేమించి… పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్‌తో విచారణ చేపట్టిన విశాఖ జిల్లా గాజువాక పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. సీఐ మల్లేశ్వరరావు, బాధిత భర్త ప్రసాద్ వివరాల మేరకు… చినగంట్యాడకు చెందిన యువతిని గతేడాది డిసెంబరులో ప్రసాద్ మ్యారేజ్ చేసుకుని లక్నో తీసుకెళ్లాడు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని.. దశలవారీగా రూ.90 లక్షల వరకు తీసుకున్న యువతి గాజువాక వచ్చేసింది. మళ్లీ ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి ఎంక్వైరీ చేశాడు. అయితే అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు షాకింగ్ నిజాలు తెలిశాయి.
సినిమాకు మించిన ట్విస్టులు….
విశాఖ జిల్లా చినగంట్యాడకు చెందిన ఓ యువతి ప్రియుడి కారణంగా ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా పేరెంట్స్ చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె గర్భవతి అన్న విషయం పెళ్లైన మూడో రోజుకే భర్తకు తెలిసి… ఆమెను వదిలేశాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయిన ప్రియుడి దగ్గరకు వెళ్లి తనని మ్యారేజ్ చేసుకొమ్మని అడిగింది. పెళ్లి చేసుకోవాలంటే… తన కుటుంబంలో బాగా డబ్బున్న ఓ వ్యక్తిని చూపించి.. ముందు అతడి నుంచి డబ్బు గుంజాలని.. తర్వాత వివాహం చేసుకుందామని ప్రియుడు సూచించాడు. ఇద్దరూ కలిసి అక్కడ కూడా పెళ్లి డ్రామా ఆడి అతడి నుంచి అందిన కాడికి దోచుకున్నారు. ఈలోపు రెండో భర్తకు విషయం తెలిసిపోయింది. అక్కడి నుంచి ఆమె పరారయ్యింది. తిరిగి ప్రియుడితో కలిసి మరో వ్యక్తిని వలపు వల వేసి.. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. చివరికి రెండో భర్త ఫిర్యాదుపై అడ్డంగా దొరికిపోయింది. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Also Read: