Manoharabad MPDO Arrest: మెదక్ జిల్లా మనోహరాబాద్ MPDO జైపాల్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు సోదాల ద్వారా తేల్చిన అధికారులు.. రూ.3 కోట్ల 40 లక్షల విలువైన స్థిర, చరాస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జైపాల్‌రెడ్డి ఆఫీస్, మేడ్చల్‌లో ఆయన ఇంటితో పాటు మరో రెండు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ రేంజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో దాడులు సాగాయి. సూర్యనగర్‌లో జైపాల్‌రెడ్డి నివాసం, మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో సోదాలు చేశారు. జైపాల్ రెడ్డి ఇంట్లో 66 లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 25 లక్షల రూపాయల నగదు గుర్తించినట్లు ACB అధికారులు ప్రకటించారు. మరో మూడు బ్యాంకు లాకర్లూ ఉన్నట్లు గుర్తించారు.
వెల్దుర్తి ఈవోపీఆర్డీగా ఉన్న జైపాల్‌రెడ్డి 2019 నవంబరులో ప్రమోషన్‌పై మనోహరాబాద్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తుండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దీనికి ఆమోదం తెలిపారు. కానీ జిల్లా పాలనాధికారి ఆమోదం తెలపకపోవడంతో నిలిపివేసినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల పాటు సెలవులో ఉన్న ఆయన ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. జైపాల్ రెడ్డి కూడబెట్టిన ఆస్తుల గురించి ACB అధికారులు పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. జైపాల్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఎక్కువ మొత్తంలో కూడపెట్టారన్న ఆరోపణలున్నాయి. తన పేరుపై ఉన్న ఆస్తులు ఎన్ని? బినామీల పేరుపై రాసినవి ఎన్ని? మొత్తం వివరాలు రాబట్టనున్నారు.