Bicycle Thief : లగ్జరీ సైకిళ్లను దొంగిలిస్తున్న నేపాల్‌కి చెందిన వ్యక్తిని పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసేవాడని గుర్తించారు. కరోనా వల్ల హోటల్ మూతపడటంతో దొంగగా మారాడని పోలీసులు తెలిపారు. ఆషిక్ జీవన్ ఆలే అనే 24 వ్యక్తి ముంధ్వా నివాసి. హోటల్లో వెయిటర్‌గా ఉద్యోగం కోల్పోయిన తరువాత అతడు తన స్నేహితులు, బంధువుల దగ్గర చాలా అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేక సైకిళ్లను దొంగిలించడం ప్రారంభించాడు. పోలీసులు అతడి దగ్గరి నుంచి 14 లగ్జరీ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
విక్టర్ డెనిస్ అనే వ్యక్తి తన సైకిల్ ఎవరో దొంగిలించారని పూణె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవి పుటేజీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఒక వ్యక్తి సైకిల్ దొంగిలించడం కనిపించింది. దర్యాప్తు చేయగా అతడు హోటల్‌లో పనిచేసే వెయిటర్‌గా తేలింది. చివరకు పోలీసుల విచారణలో ఆషిక్ జీవన్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి దగ్గరి నుంచి 1.55 లక్షల విలువైన సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పార్కింగ్ స్థలంలో పెట్టిన సైకిళ్లను మాత్రమే దొంగిలించేవాడని తేలింది. అయితే సైకిళ్లు పోయిన వారు హడప్సర్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సదరు సైకిల్‌కి సంబంధించిన నిజమైన బిల్లును తీసుకొని వస్తే సైకిల్ ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు.